42. మాయావృత్తిత్రయం

42.  మాయావృత్తిత్రయం


            విశుద్ధ సత్వరూపమాయ, మలిన సత్వరూపావిద్య, తమః ప్రధానరూప ప్రకృతియనునివి మాయావృత్తి త్రయంబు. వాటియందు మాయయె సుప్తియందు పరబ్రహ్మంబుతోడ నధ్యాసైక్యంబై యుండి, స్వప్న జాగ్రత్తులయందు కించిదాద్య వస్తలంబొందు చున్నప్పుడా బ్రహ్మచైతన్యంబు దానియందు ప్రతిఫలించి, సర్వజ్ఞత్వాదిగుణ విశిష్టచైతన్యుండైన యీశ్వరుం డనుపించి, ప్రతిపదంబున ప్రేరయితనుపించుకొనుట చేతను, ఆ మాయ ఈశ్వరున కుపాధియైయ్యు, అమోహకారణి యనుపించు కొనియుండు. మరియు నా యవిద్యయె నానాత్వంబుచేత భోక్తృవైన పశు పదార్థంబునదగిన జీవుల కుపాధదియై మోహింపజేయు చుండును.  మరియు నాప్రకృతియె భోగ్యాత్మకత్వంబుచేత పాశపదార్థంబనదగి, గుణత్రయ సమానావస్థచే యుండి, అవిద్యయందు ప్రవేశించి యుండెడు జీవుల భోగార్థంబుగా సకల కార్యంబౌటకై యీశ్వరసన్నిధాన క్షణమాత్రంబుచే చలరేగి, మొదలు కాలతత్త్వంబు వడశి, మీద నాకాలవశంబుచే పరిణమించి, మహత్తత్త్వమను పించుకొను  నమ్మహత్తత్త్వ మెట్లనిన విత్తిన విత్తనంబు అంకురింపక పూర్వ రూపంబును గాక వుఛూనావస్థం బొందుచందంబున కారణ ప్రకృతి గాకనె కరణంబు అయిన యహంకారంబునుం గాక మిథ్యాజ్ఞాన నిర్వికల్ప రూపంబుచే మధ్యావస్తయనబడు.  మరియు నమ్మహత్తత్త్వంబుచేత గుణభేదంబు గలిగి మిథ్యాజ్ఞాన సవికల్ప రూపంబైన ప్రథమాధ్యాసంబున నొప్పెడి మూలాహంకారంబు జెనించుచుండు.