32. ఈశ్వరుని పంచకృత్యములు

32. ఈశ్వరుని పంచకృత్యములు


            సృష్టి, స్థితి, సంహార, నియామన, అనుప్రవేశంబులను నివె యీశ్వరుని పంచకృత్యంబులు.  మరియు నిర్వికారత్వంబు చేత, నద్వితీయ్య బ్రహ్మస్వరూపంబైన యీశ్వరుని యందు సృష్ట్యాది బహుకృత్యం బెట్లు ఘటించుననిన, యట్లుసూర్యుండు యిచ్ఛాయత్నాదికంబులేక తనవృష కిరణంబులచేత వృష్టిరూప జలంబు గురిపించి, ఆ జలంబునందు ప్రతిబింబ రూపంబుచేతనె ప్రవేశించి, మేఘాదికంబుచె ఆ జల ప్రతిబింబంబును మరుగుజేసి, హిమకిరణాదులచేత జల ప్రతిబింబంబు దడసి ఉష్ణకిరణంబులచేత ఆ జలంబులబీల్చి, తన ప్రతిబింబంబు తనలో గల్పు కొనునట్లు మహేశ్వరుండు తనమాయా శక్తితో గూడి చిత్ప్రధానత్వంబుచె నిమిత్త కారణుండై, జడ ప్రధానత్వంబుచేత ఉపాదాన కారణుండనిపించి, బుద్ధ్యాదికార్యంబుల సృజించి, జీవరూపంబుచేత తానె ప్రవేశించి, కర్మంబుచే భోక్తృ వనిపించి, నియామక శక్తి చేత నాభోగ్య భోక్తృవుల నియమించి, రుద్రరూపంబుచేత నట్టికార్యం బుపసంహరించి, మరి శృత్యాచార్య రూపంబుచే జీవుని తనలో నైక్యంబు గావించికొనుననుటె సత్యంబగు.