27. జీవనామరూప వ్యవహారం

27. జీవనామరూప వ్యవహారం


            పూర్వోక్త చిద్రూప భేదమైన జీవేశ్వరాది చతుష్టయంబునకు క్రమంబుగా నామాది వ్యవహారకల్పన లెట్లనిన, మొదలు జీవుండె విశ్వతైజస ప్రాజ్ఞులని త్రివిధం బైయుండు.  వానిలో స్థూలశరీర వ్యష్ట్యభిమాని వ్యావహారిక జీవుండు. బుద్ధి ప్రతిఫలిత చైతన్యుండు చిదాభాసుండు.  క్షేత్ర, శరీర, ప్రమాతృ, కర్త, భోక్త, సంసారి, విషయ, పరాగాత్ముండు, విజ్ఞానమయుండు, త్వంపద మబాధుండ మనునివి మొదలైనవె విశ్వపర్యాయ నామంబులగు. మరియు సూక్ష్మశరీర వ్యష్ట్యభిమాని ప్రాతిభాసిక జీవుండు, స్వప్న కల్పితుండనునివి మొదలయినవె తైజనుని పర్యాయ నామంబులు.  మరియు కారణశరీర వ్యష్ట్యభిమాని, అవిద్యోపాధికుండు, కార్యోపాధికుండనునవి మొదలయినవె ప్రాజ్ఞుని పర్యాయ నామంబులు.