14. అష్టగురువులు

14. అష్టగురువులు


            శ్రీగురుండె సాధకంబైన శిష్యాధికార భేదంబుచేత బోధక గురు, నిషిద్ధగురు, వేదక గురు, కామ్యకగురు, వాచకగురు, సూచకగురు, కారకగురు, విహితగురువన అష్టవిధుండైయుండు.  వారియందు, శాస్త్రార్థంబుల చెప్పునతండు బోధక గురుండు, తత్త్వ దర్మకుండె వేదక గురుండు, వశ్యాకర్ష ణాదులచే ఇహమందు సుఖమున్ను పరలోకంబున దుఃఖంబును యిచ్చునతండె నిషిద్ధ గురుండు.  పుణ్యకర్మోపదేశంబులచే ఇహపరంబులందు సుఖప్రదుండె కామ్యక గురుండు.  వివేకమార్గంబున శమదమాదిషడ్గుణ ప్రదుండె సూచక గురుండు, విషయంబుల మిథ్యాత్వదర్శనంబుచేత నాత్మానురాగప్రదుండె వాచక గురుండు.  శివజీవైక్య జ్ఞానప్రదుండు కారకగురుండు, సంశయనిరసన ద్వారా నిత్యముక్తి ప్రదుండె విహిత గురుడనదగు.  మరియు సద్గురు సమీపంబు గూర్చి సచ్ఛిష్యుండెవ్వండైనను తాపత్రయాగ్నిచే గ్రాగి వ్యాకుల చిత్తుండై నేనెవడ నాకీసంసారంబెట్టి కారణంబునంగలిగె నిదియెవ్వనిచె నివర్తింపంబడు నని విచారించి చూచి పత్రపుష్పఫలాది సహపాణియై విద్యావినయ వైరాగ్యాది సద్గుణ సమేతుండగు శ్రీ గురు సన్నిధింజేరి చైతన్యం శాశ్వతం శాంతంబనునివి మొదలుగాగల యష్టమంత్ర పూర్వకంబుగా పదద్వయ కరద్వయ భుజద్వయ లలాట వక్షంబులు నేల సోకునట్లుగా ప్రణామంబొనర్చి మరిలేచి భక్తిచే కరమకలంబులు మోడ్చి కింకర భావంబుగల్గి కార్పణ్య యుక్తుండై కూరిమిచే కొనియాడి జ్ఞాన వైరాగ్య బలైశ్వర్య కీర్తి శ్రీలను సద్గుణ సమేతుండైన భగవంతుండవగు సద్గురుమూర్తికి ఆయాసంబు లేనట్లుగా నేరీతి నాకీభవబంధంబు విడిపింపదగునని విన్నపము చేయుటె శిష్యుని కర్తవ్యంబనదగు.